Sunday, October 5, 2008

నంది హిల్స్ యాత్రా విశేషాలు - 02 అక్టోబర్ 2008

ఈ ట్రిప్‌కి అసలు ముందు ఏమి అనుకొకుండా సడెన్‌గా అలా బయలుదేరి వెళ్ళిపోయాము. ముందు రోజు రాత్రి డిసైద్ చేసుకున్నాం, ఉదయం 5:30 కి బయలుదేరి వెళ్ళాలి అని. పాత్ర ధారులు బంతి, రాజు గారు, బాచి మరియు నేను, దానయ్యని. రాజు గారు, బాచి లు కెంప్‌ఫోర్ట్ దగ్గర, బంతి, నేను సి.వి.రామన్ నగర్ లో వుంటిమి. మేము కే.ఆర్.పురం నుంచి, అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళాలి అని అనుకున్నాము. కావున రాజు గారు, బాచి వాల్లు మా దగ్గరకి వచ్చారు. మార్నింగ్ 5:45 కి స్టార్ట్ చేశాము, 2 బైక్స్ లో. బాచి, రాజు గారు లు బాచీస్ గ్లాడియేటర్ బైక్‌లో. బాచి తన బైక్‌ని అదేదొ 450 సి.సి బైక్ లా ఊహించుకుంటాడు. ఇక పోతే, బంతి, నేనేమో నా స్వీట్ పల్సర్ 150 సి.సి లో బయలుదేరాము. తీరా స్టార్ట్ అయ్యేసరికి చూసుకుంటే, మా రెండు బైక్ లలోను, పెట్రోల్ రిసర్వ్ లో వుంది.

సి.వి.రామన్ నగర్ నుంచి, ఓల్డ్ మద్రాస్ రోడ్ మీదుగా, అవుటర్ రింగ్ రోడ్‌లో జాయిన్ అయ్యాము. తెల్లవారుజామున కావటంతో ట్రాఫిక్ పెద్దగా ఏమి లేదు. మేము అలా దూసుకుపోతూ వున్నము. అప్పుడు కెమెరా గురించి గుర్తుకు వచ్చింది, చూసుకుంటే ఎవరూ తీసుకుని రాలేదు. ఇంతలో పెట్రోల్ బంక్ వచ్చింది, పెట్రోల్ ఫిల్ చేసుకొని, హెబ్బాల్ ఫ్లై ఓవర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ హైదరాబాద్ రూట్ తీసుకోవాలి. ఒక్క సారి ఈ రూట్ తీసుకున్న తర్వాత, ఈ బైక్ రైడింగ్ ని బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు. దారిలొ మా లాగే ఇంకా కొంతమంది బైక్స్ లో నంది హిల్స్ కి వస్తుంటిరి. మద్య మద్యలొ జనాలని దారి అడుగుతూ మా యాత్రని కొనసాగించాము, న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు బాగానే సాగింది. ఎయిర్ పోర్ట్‌కి దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ ఉంది. ఈ ఫ్లై ఓవర్ పైకి వెళ్ళకుండా నేరుగా వెళితే దేవనహళ్ళి వచ్చేస్తుంది. ఆ రూట్‌లో ఒక చిన్న బోర్డ్ వుంటుంది, నంది హిల్స్ అని, అక్కడ నుంచి 22 కి.మీ. వుంటుంది నంది హిల్స్ కి. మేము సరిగ్గా ఆ ఫ్లై ఓవర్ దగ్గర నేరుగా వెల్లకుండా లెఫ్ట్ రూట్ తీసుకున్నాము, అది ఫ్లై ఓవర్ మీదనే రైట్ సైడ్ వుండే ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళింది. అలా కొత్త ఎయిర్ పోర్ట్ ని దర్శనం చేసుకున్నాము. ఒక్క బాచి కి తప్ప మిగతా వళ్ళందరికీ అదే మొదటి సారి చూడటం. మన బాచిగాడు ఒక సారి యు.ఎస్. కి వెళ్ళి వచ్చాడులెండి. ఆ ఎయిర్ పోర్ట్ దగ్గరకి వెళ్ళేసరికి మా బంతిగాడికి ఒక సందేహం కలిగింది. మనము ఇండియా లోనే వున్నామా? లేదా వేరే దేశం లోకి ఏమైనా పొరపాటున వున్నామా అని? బయటనుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు వీలు అయితే లోనికి వెల్దాం అని అనుకున్నము. ఇంకా అలా మా బైక్స్‌ని హిల్ల్స్ వైపు కి మరల్చాము.

ఇక్కడ ఈ రూట్‌లొ ద్రాక్ష తోటలు చాలా ఎక్కువ. పక్కన అలా ఆగి కొందాం అనుకొని రుచి చూస్తే, అవి ఎంత పుల్లగా వున్నాయి అంటే, అవి ద్రాక్షలా లేదా నిమ్మ కాయలా అని సందేహం కలిగి కొనకుండా వచ్చేశాము. సరిగ్గా ఇక్కడ రాజు గారి బైక్ ని వీడి, రూట్ మిస్ అయి వేరే రూట్ లోకి దూసుకుని వెళ్ళిపోయాము. తిరిగి చూస్తే బాచి వాళ్ళ బైక్ వెనక లేదు. మేము రూట్ మిస్ అయినది అట్టించుకోకుండా, బాచి వాళ్ళు మిస్ అయ్యారు అని అక్కడే కాసేపు వేచి చూసాము. పాపం పిచ్చివాళ్ళు, మేము చాలా స్పీడ్‌లో వెళ్ళిపొయాము అని, మా కోసం వాళ్ళు ఇంకా స్పీడ్ లో వెళ్ళిపొయారు. ఇక ఎందుకో సందేహం వచ్చి దారిలో్‌వాళ్ళని అడిగితే విషయం అర్ధమయి మళ్ళీ స్టార్ట్ చేసాం మా యాత్రని. ఇక సరిగ్గా హిల్ దగ్గరకి వచ్చేసరికి, మా ఇద్దరి బరువు కి పల్సర్ కూడ చిన్నగా మూలుగుతూ కదిలింది. అప్పటికి సమయం 7:00 దాటింది. అయినప్పటికీ మంచు ఇంకా అలానే వుంది. అలా మంచులో డ్రైవ్ చేస్తూ, ఎదురుగా వచ్చే వాహనాలని తప్పించుకుంటూ ఎలాగో ఒకలా కొండ పైకి చేరుకున్నాము. అప్పటికే అక్కడ నుంచి
కొంత మంది తిరుగు ప్రయానం పట్టేసి వున్నారు.

ఇక బాచి వాళ్ళు మమ్మల్ని చూసి, "అబ్బా వచ్చారురా బాబు తప్పిపోకుండా", అన్నట్లు ఒక చూపు మా పైకి విసిరి, "ఎంతసేపురా బాబు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక జరిగింది చెప్పుకొని, టికెట్ కౌంటర్ వైపుకి వెళ్ళాము. టికెట్ మనిషికి మూడు రూపాయలు, కాని బైక్ పార్కింగ్‌కి మాత్రం పదిహేను రూపాయలు. అది ఏమిటో విడ్డూరం! ఇక ఆ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కొంత దూరం పైకి నడక సాగించాము. టూ వీలర్స్‌ని అక్కడ వరకే అనుమతిస్తారు. కాని ఫోర్ వీలర్స్‌ని మాత్రం ఆ పైకి కూడా తీసుకొని వెళ్ళవచ్చు.

ఆ కొండలు, ఆ ప్రదేశాలు చూస్తే అప్పుడు అనిపించింది మాకు, కెమెరా మరచిపోయి ఏమి మిస్ అవుతున్నామో అని. ఇంతలో మా బంతిగాడు ఈ నంది హిల్స్ చరిత్ర చెప్పటం మొదలు పెట్టాడు. మన వికీపీడియాని ఒక మారు బట్టీయం వేసి వచ్చాడంట. టిప్పు సుల్తాన్ తప్పు చేసిన వాళ్ళని ఆ కొండ మీదనుంచి తోయించేవాడు అని... చాలా చాలా విషయాలు చెప్పాడు. ఇలా మేము కబుర్లలో వుండగా అకస్మాత్తుగా ఒక అతను నా దగ్గరకు వచ్చి. "నీ పేరు దానయ్య కదూ" అని అన్నాడు. నేను ఒక సారి నా బుర్రలోని ఙ్ఞాపకాలని వెతకటం మొదలుపెట్టాను. ఎంత ఆలోచించినా అతని పేరు గుర్తు రాలేదు. కాని అతను నా హై స్కూలు క్లాస్‌మేట్ అని మాత్రం గుర్తు వచ్చింది. ఇంతలో తనే... "నేన్రా దినేష్-ని" అంటూ పరిచయం చేసుకున్నాడు. నా మతిమరుపుకి నాకే బాధ అనిపించింది. ఇక మా బంతిగాడు, బాచిగాడు దీని మీద టీజ్ చెయ్యటం మొదలు పెట్టారు. అలా ముందుకు వెళ్తుండగా, ఒక చిన్న రెస్టారెంటు వచ్చింది. వెళ్ళి కూర్చొని, పరిస్తితి చూస్తే, బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ ఇస్తే లంచ్‌కి వచ్చేలాగా ఉంది. ఎదో ఒకలాగా మా బ్రేక్‌ఫాస్ట్ ముగించి ఒక చోట కూర్చొని పిచ్చాపాటి మాట్లాడటం మొదలు పెట్టాము. క్రికెట్టు, రియల్ ఎస్టేటు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, వివాహాలు మొదలుకొని అన్ని విషయాల మీదా మా సంభాషణ కొనసాగింది. అలా అన్నీ మాట్లాడుకుని, మళ్ళీ ఇంకొక రౌండ్ అలా నడుచుకుంటూ, తిరుగు ప్రయాణం పట్టాము. ఈసారి బైక్స్ స్టార్ట్ చెయ్యకుండానే కింద వరకూ వెళ్ళవచ్చు అని అనుకుంటూ, బయలుదేరాము. సగం దూరం వచ్చేసరికి స్టార్ట్ చెయ్యాల్సిన అవసరం వచ్చింది.

కిందకి వచ్చేసరికి మళ్ళీ ఒక సారి బాచిగాడు అలా మా వైపు ఒక చూపు చూశాడు. ఇంతకుముందు కొండమీదకు వచ్చినప్పుడు చూశాడు చూడండి, అవే చూపులు అన్నమాట. ఇక అలా అలా కొంత దూరం వచ్చేసరికి మా బంతిగాడికి ఒక అనుమానం వచ్చింది. మనం వచ్చేటప్పుడు ఈ రూట్‌లో వచ్చినట్లు లేదే అని. మా వాడు కొంచం షార్ప్‌లెండి. ఆ తర్వాత కొంచెంసేపటికి కంఫార్మ్ చేసుకున్నాం, వేరే రూట్‌లో వెళ్తున్నాము అని. ఆ విధంగా మా తిరుగు ప్రయాణం వేరే మార్గంలో సాగింది. అలా కొంత దూరం వచ్చాక దారిలో చింత చెట్లు వచ్చాయి. చింతకాయలు అంటే మా బంతిగాడికి బాగా ఇష్టం. దానితో, అక్కడ ఆగి కాస్సేపు చింతకాయలు కోసి మళ్ళీ బయలుదేరాము. అప్పటికి రాజు గారు, బాచిగాడు దూసుకొని వెళ్ళిపోయి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బాచిగాడు, రాజుగారు బైక్‌ని మార్చి మార్చి డ్రైవ్ చేశారు. కాని మా బంతిగాడు మాత్రం నాకు ఆ శ్రమ లేకుండా తనే పూర్తిగా డ్రైవ్ చేశాడు.

ఈసారి మళ్ళీ ద్రాక్ష తోటలు కనిపించాయి. బుట్టలో పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఒక బుట్ట నలభై రూపాయలు అని చెప్పారు. మేము బుట్టలో రెండు కిలోలు వుంటాయా అని అడిగాము. అతను, కాదు, నాలుగు కిలోలు వుంటాయి అని చెప్పటంతో ఆశ్చర్యపోవటం మా వంతయ్యింది. ఆ చోటు పట్టణం నుంచి సుమారు ఒక ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండి ఉంటుంది. అదే ద్రాక్ష మన పట్టణంలో కిలో ముప్పై రూపాయలు తీసుకుంటూ వుంటే, అక్కడ నాలుగు కిలోలు నలభై రూపాయలా!!! ఎంత వ్యత్యాసమో కదా!!! మళ్ళీ మా చర్చ దాని మీదకు మళ్ళింది. మాటల్లో వుండగానే బాచివాళ్ళు మాకోసం వెయిట్ చేస్తూ వుండే చోటికి చేరుకున్నాము. మళ్ళీ బాచి మా వైపు అవే చూపులు విసిరాడు. సంక్రాంతి సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్‌లు ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్లు ఇలా మా ట్రిప్‌లో అంతా కూడా అలా చూస్తూనే వున్నాడు.

ఇక ప్రయాణం ఊపందుకొనేసరికి, చిటికెలో హెబ్బాల్ ఫ్లైఓవర్ వచ్చేసింది. ఇక్కడ కే.ఆర్.పురం వైపు వెళ్ళాలి అంటే లెఫ్ట్ తీసుకోవాలి. కాని మా బాచి శరవేగంతో సిటీలోకి దూసుకుని వెళ్ళిపోయాడు. ఫోన్ కాల్ చేసి చెప్పిన తర్వాత వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు. అప్పటికి మా బంతిగాడి పని అయ్యిపొయింది. ఉదయమే త్వరగా నిద్ర లేవాలి అని, ముందు రోజు పదింటికి పనుకున్నాము. కాని బంతిగాడేమో నిద్ర పట్టక ఒక సినిమా వేసుకున్నాడు. దానితో నిద్ర తక్కువ అయి, ఈ జర్నీతో పూర్తిగా అలసిపోయాడు. ఇంటికి చేరుకొని పడక ఎక్కేశాడు. ఇక బాచి మాకు వాళ్ళ రూములో భోజనం ఏర్పాటు చేయగా, బాగా భుజించి, విశ్రమించాము. ఇక నేను కూడా విశ్రమిస్తాను.